Wednesday, December 19, 2007

మనో భంగము ( కథ )


'ఏమేవ్`! రేపు మా రీజినల్ మేనేజర్ మన ఇంటికి భోజనానికొస్తున్నాడు. ఏం చేస్తావో ఏమో అదిరిపోవాలి. నా భవిష్యత్తు ఆతని చేతుల్లో ఉంది. జోనల్ మేనేజర్ పోస్ట్ కి జరిగే ఫైనల్ ఇంటర్వ్యూలో మెంబర్ అతను. అబ్బ ఈ ఆవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు.. మూడు జిల్లాలకి బాస్`. బంగ్లా , కారు..లైఫే చేంజ్ అయిపోవచ్చూ అని చిన్న పిల్లాడిలా చెప్పుకుపోతున్న ఆతని మొహంలో సంతోషం చూసి ముచ్చటేసింది. 'సరె పొద్దున్నే లేపండి, ఓ రెండు రకాల కూరలతో, స్వీట్`, పరమాన్నాలతో ముగించేద్దాం అంటూ రేపటి మెనూ మీద పడ్డారు ఆ ఇద్దరు. వాళ్ళకి పెళ్ళై 6 సంవత్సరాలు కావస్తుంది. ఒకడే కొడుకు 4 ఏండ్లుంటాయి వాడికి. చిన్న ఉద్యోగమైనా ఎడతెగని కృషితో మంచి స్థానం సంపాయించాడు కంపెనీ వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు జరిగే సెలెక్షన్` లో ప్రమోషన్` కు ఇతను ఒక అభ్యర్ధి. ఎలాగైనా ప్రమోషన్` తనకే రావాలని ఆకాంక్ష. అలా కబుర్లు చెబుతూ పడుకున్నారు. ఉదయం హడావుడిగా లేచి భోజన తయారీ కార్యక్రమంలో పడ్డారు ఇద్దరు. పిల్లాడు బంతితో ఆడుకుంటు తిరుగుతున్నాడు. అతనికి బహుమతిగా ఇవ్వటానికి తెచ్చిన విదేశంలో కొన్న చాలా ఖరీదైన డిన్నర్ సెట్ ఓ పక్కనే పెట్టారు. అనుకున్నవన్నీ అనుకున్నట్లు వండి టేబుల్ చేరినాయి. వాళ్ళు వచ్చే టైం కూడా అయ్యింది. అలసిపోయిన ఆమె అన్నీ తృప్తిగా పరికించి ఆ ఉద్యోగం ఇతనికే రావాలని దేముడిని మొక్కుకుంది. ఇంతలో అబ్బాయి ఆడుకుంటున్న బంతి కాస్త ఆ డిన్నర్ సెట్ మీద పడి అనుకోనిది జరిగిపోయింది. ఒకేక్షణంలో తుత్తునియలై పోయింది బహుమతి. ఆమె నోట మాటల్లేవు. ఆ శబ్దం విని పరుగెత్తుకొచ్చిన అతని మొహంలో క్రమేణా కోపం ఆవరించింది. కారణమైన వాడు ఎదుటే బిత్తరపోయి ఏడుస్తున్నాడు. అంతే చిన్నవాడని కనికరమైనా లేకుండా పటా పటా లాగించేడు. వాడు 'అమ్మా, అమ్మా' అంటూ హృదయవికారంగా ఏడుస్తూ తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. వాడితో పాటు ఆమెకు కూడా దెబ్బలే. కొద్దిగా తేరుకున్న ఆమె హృదయం మాతృప్రేమతో అల్లల్లాడింది. ఆఖరికి నోరుపెగల్చి, 'కొట్టకండి. ఏదో తెలీక చేసాడు, ఇక వదిలేయండీ అంటూ బ్రతిమిలాడింది. ఊహూ..వింటేగా! కళ్ళెదుట కొత్త ఉద్యోగం కూలిపోయిన దృశ్యమే అతనికి.. 'చంపేస్తా నరికేస్తా దరిద్రపు వెధవాని. నా కొంప కూల్చడానికే పుట్టావురా' అని ఇంకా హేయమైన తిట్లు తిట్టసాగాడు. ఆ దెబ్బలకు అబ్బాయి ఎప్పుడో స్పృహలేక పడిపోయాడు. కాని అతనికి అవేం కనపడట్లేదు... చలనం లేని వాడ్ని చూసి తల్లి హృదయం ద్రవించిపోయింది. ఇక ఆపండి..వెధవ ఉద్యోగం ఉంటే ఎంత ఊడితే ఎంత..పిల్లవాడిని అలా చావబాదుతారా.. అంటూ ఎదురుతిరిగింది.. అప్పటికే కన్నీళ్ళు వరదలై కారుతుంటే. 'ఇక ఆపు నీ సోది! అలా పిశాచంలా తయారయ్యావే ! పో, సరిగా తగలడు. వాళ్ళు వచ్చే వేళయిందీ అంటూ గదమాయించాడు. పిల్లాడేమో మాటా పలుకు లేక పడిఉన్నాడు. అదే మాట చెప్పింది. 'ఛత్`! వాడిని ఆ చివరిరూంలో పడేయ్`. చస్తే చావనీ' అంటూ.. కింద పగిలిన ముక్కలేరసాగాడు. 'ఛీ ! మీరు మనిషా, పశువా! పిల్లవాడు ఈ స్థితిలో ఉంటే అలా అనడానికి నోరెలా ఒప్పింది. పదండి డాక్టర్ దగ్గరికీ అందామె. 'చంపేస్తా ఇల్లు కదిలావంటే..ఆ ఏడుపాపి ఇవన్నీ సర్దూ అంటూ హుకుం జారీ చేసాడు. ఇక ఊరుకోలేకపోయిందామె..ఒక్క ఉదటున లేచి పిల్లాడిని భుజాన వేసుకుంది. బట్టలు సర్దలేదు. తలదువ్వలేదు. మొహం కడగలేదు. రయ్` న బయటకొచ్చింది. అవాక్కయిన అతను నిశ్చేష్టుడై నిలిచిపోయాడు. ఇంతలో రావలిసిన చుట్టాలు కారులో వచ్చి ఆగారు. అయినా ఆమె బయటికి వెళ్ళిపోయింది బిడ్డని భుజానేసుకొని..

------------------------------------------------- ------------- ఇక ఇక్కడ ఆగుదాం॥మళ్ళీ ఒకసారి మొదటనుంచి చదవండి.. ఎందుకంటే ఇదే కథ మలుపు తిరిగితే.....ఎలాఉంటుందో।చెబుతా..చదివారా... ఇక కింద చదవండి-----------------------------------------------2- -------------------



అదే ఇల్లు అదే మనుషులు అదే సీను అదే మాటలు అదే వంట అదే కుర్రాడు అదే బంతి ... కానీ ఆశ్చర్యం.. వెంట్రుకవాసిలో డిన్నర్ సెట్ తప్పించుకుంది. అది చూసిన తల్లి 'ఒరే బాబు బYఅటికెళ్ళి ఆడుకో. ఇక్కడ వస్తువులున్నాయి జాగ్రత్తా అంటూ ముస్తాబవసాగింది. ఇంతలో కారు రయ్` మంటూ ఆగింది. కారులోంచి బాస్ దంపతులు, వారి సుపుత్రుడు దిగారు. 'రండి, రండీ అంటూ ఈయన స్వాగతం పలికాడు సతీ సమేతంగా. 'బాగుందోయ్ ఇల్లూ అంటూ చుట్టూ పరికిస్తూ లోనకడుగెట్టారు వాళ్ళు. ఇంతలో వాళ్ళ కుర్రాడు తన కాలికి అడ్డమొచ్చిన బంతిని ఒక్క తన్ను తన్నటం, ఆ బంతి విసురుగా ఆ డిన్నర్ సెట్ పగలకొట్టడం. క్షణంలో జరిగిపోయింది. దఢేల్ మని శబ్దం. ఆ తరువాత నిశ్శబ్దం.. రెండు క్షణాలు ఎవరూ తేరుకోలేదు.. 'ఎంత పని చేసావురా' అంటూ బాస్ భార్య కుర్రాడిని గదమాయించింది. బాస్ మాట్లాడబోయేంతలో.. మన వాడు ఎలాగో నోరు పెగల్చి, కోపాన్ని దిగమ్రింగి.. మార్పులు ఫేస్`లో కనపడకుండా, 'పోనీండి. చిన్న పిల్లాడు. ఏదో తెలియక జరిగిపోయిందీ అంటూ భార్యని అవన్ని తీసేయమన్నాడు.. మొహంలో ఎలాంటి కోపం లేదు. విసుగు లేదు..అసలు ఏమీ జరగనట్టే ఉంది పరిస్థితి. 'అలాగేనండీ అంటూ ఆమె శుభ్రంచేయడానికి వంగింది. 'పోతే పోయింది లెండి. ఇంకోటి కొనుక్కోవచ్చు..మీరిలా కూర్చోండి. ఒక్క పది నిమిషాల్లో రెడీ చేసేస్తాం' అని పక్కకి తీసుకెళ్ళాడు. 'ఔరా! పదోన్నతి..' ఆ తరువాత ఏం జరిగింది మనకనవసరం.. జరిగింది ఒకటే సంఘటన.. స్పందనలు రెండు... ఎంతటి మార్పు స్పందనలో...... ఇలాగే ముందు పేజీలో నడుచుకుని ఉండొచ్చుగా... కానీ జరగలేదు .. మనోరుగ్మత.. అందరూ కాకపోయినా చాలామంది ఇలాగే ఉంటారు. అందుకే సంఘటనలని పక్క పక్కనే ఉంచా.. ఏదైనా ఇలాంటి సంఘటన జరిగితే.. అన్ని పరిస్థితులలో ఒకేలా ఎందుకు స్పందించకూడదు....అనేదే ఇప్పటి ప్రశ్న.. (ఎప్పుడో సైకాలజీలో జరిగిన చర్చ దీనికాధారం)

2 comments:

Anonymous said...

బాగుందండి వినాయకం గారు :) ఏమి చేస్తాం మనిషి తీరే అంత!
మీరు చెప్పింది చూస్తుంటె నాకు 12 బి ,టైం (అనుకుంట ) సినిమాలు గుర్తుకు వస్తున్నాయి :)

vinayakam said...

halO RAdha...

Thamnks

asssalu kanipistaleru..