Wednesday, November 21, 2007

మావీ బ్రతుకులే....

రాం నాం సత్య హై.. నారాయణ నారాయణా.. శవాన్ని స్మశానం ముందు దించారు.. అందరి మొహాల్లో దిగులు దైన్యం.. పది నిముషాలు కావస్తుంది ఆలస్యం ఎందుకో అర్థం కాలే.. చిన్న తగాదా.. వందరూపాయలు ఎక్కువిస్తేగాని దహనం కుదరదంటున్నాడు కాటి కాపరి. అదీ సంగతి.. చచ్చిన శవం ఓ వైపు, బేరసారాలొక వైపు వాడినే అందరూ దుయ్యబడుతున్నారు.. ఏరా కొవ్వెక్కిందా ..ఇచ్చింది తీసుకుని కార్యక్రమం కానీ ఇచ్చేది లేదు ఏం చేస్తావు.. సందు చూసుకుని బేరాలు మొదలెట్టాడు ముదనష్టపోడు నీకు దయ జాలి లేదా ఆత్మీయుల్ని పోగొట్టుకుని మేమేడుస్తుంటే ఇప్పుడు తగాదాపడతావే..వాపోతున్నారు ఆలస్యం భరించలేని వాళ్ళు.. ఇచ్చేయరాదూ ఇప్పుడు గొడవెందుకు...అంటున్నారు అబ్బే అలావదిల్తే నెత్తినెక్కుతారు ..వెధవల్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి.. అని కూడా వాళ్ళే..చెప్తున్నారు రణగొణధ్వని..తిట్ల పరంపర..చీవాట్లు.. ఇన్నిటి మధ్య కాటికాపరి..మొహంలో ఏ అనుభూతి లేదు వాడికి ఇట్లాంటివి మామూలే.. ఒకటే సమాధానం అయ్యా.. కట్టెల రేట్లు పెరిగినాయి.. కిరోసిను రేటు పెరిగింది. పిడకలు దూరం నుంచి తేవాలి..ఇక్కడెక్కడా దొరకదు మీరిచ్చే దాంటో ఎట్టా కుదురుద్ది సామీ, ఓ వంద ఎక్కువేసి ఇవ్వండి... రెండు కుటుంబాలు బతకాలి..దొరా..మాకిదే జీవనం.. దయుంచండయ్యా.. వాడి గోల అంతా దొంగాటలు .. తిని తాగటానికే ఈ ఎత్తులు .. అంటూ వీళ్ళ గొల తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు..అందరూ ఇక సహనం కూడా చచ్చి కసితో కోపంతో ఈర్ష్యతో ఒప్పుకున్నారు. ఎట్టకేలకు వంద తీసుకుని గాని శవాన్ని లేపనీయలేదు వాడు. శవదహనం అయిపోయింది.. తీసుకున్న డబ్బులు పంచుకున్నారిద్దరూ.. చేతిలో పడ్డ పైసలు చూడగానే.. తిన్న తిట్లన్నీ గుర్తొచ్చాయి వాళ్ళకి.. వచ్చింది చెరో యాభై..తిన్నవి లక్ష తిట్లు.. ఇంతవరకు ఆపుకున్న బాధ కన్నీళ్ళై కారింది.. భోరున విలపించారు ఒకరిని చూసి మరొకరు.. యాబై రూపాయల కోసం పడ్డ పాట్లు తిన్నతిట్లు ఇవే వారి అలోచనల్లో.. కాసేపు కుమిలి కుమిలి ఏడ్చాక ..ఆ స్థానంలో మెల్లగా కోపం కసి ఉక్రోషం వచ్చేసింది..ఉప్పుతిన్న శరీరాలాయే ఒరే ఎంకీ !! ఇప్పుడు మనల్ని తిట్టినోళ్ళూ అంతా శవాన్ని అడ్డుపెట్టుకుని అన్నేసి మాటలు అన్నారే.. మన బ్రతుకే ఇదికదా నెలనెలా జీతలు రావాయె మరి మనం బ్రతికేదెట్టా..ఆల్లకి ఇంటద్దెలు కఋవు భత్యాలు ఇవ్వకుంటే ఆగడాలు చేయరా..?.? అదిడిసిపెట్టన్నా !! పోయినాడని భీమా డబ్బులు అడగరా. బీరువా తాళాలతో తెస్తున్నారా ఈడికి.. ఉంగరాలేవీ..గొలుసులేవి...ఎంత ఆత్మీయులైనా ఊడబెరికి తీసుకొస్తారుగా..మనకు 100 రూ ఇవ్వడానికేం..? చచ్చినోళ్ళ సొమ్ములన్నీ తీసేసుకుంటారు వాళ్ళ శవం కాల్చనీకి ఓ వంద కు పేచిలెడతారు..ఏం బతుకులో చ్చీ.. దీనమ్మ.. ఔ తమ్మీ మనమేమైనా మిద్దెలు మేడలు కట్టనీకి అడుగు తున్నామా చచ్చిన శవాన్ని వదిలించుకోనీకి ఆళ్ళోస్తారు ఇంట్లో బతికిన శవాలు చావకుండా మన కక్కుర్తి..ఇదీ తప్పే. కుక్కి మంచం మీద దుప్పటెత్తితే గాని కనపడని బక్కచిక్కిన తల్లి. ఊళ్ళోవాళ్ళేమిచ్చినా ఇవ్వకున్నా కనపడిందల్లా తిని ప్రాణమ్మీదికి తెచ్చుకునే చంటిది. ఎనిమిదేళ్ళకే ఉక్కు కమ్ములతో కుస్తీ పట్టే బక్క పీనుగు నా కొడుకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా పుట్టింటి చీరలతోనే కాలం గడిపే భార్య. ఇదీ నా సంసారం.. అందుకే డబ్బులడిగా అని సాటాలా అందరికీ..?? నాకు తెలీక అడుగుతుండా..జీతం పెరగకుండా.,రేట్లు పెంచకుండా., కూలీ పెంచకుండా ఒక్కరైనా ఉన్నారా..మరి నేనో వంద అడిగితే తప్పయిందా దొంగ సచ్చినోళ్ళూ.. నా ఇంట్లో నాలుగు బతికిన శవాలున్నాయి.. మరి బువ్వన్నా ఎట్టాలిగా.. బతికిన్నాళ్ళూ ఈ మాత్రం తీసుకోకుంటే..మా బతుకులెట్టా.. కనీసం రేపు ఓ రెండు శవాలైనా వస్తేగానీ తల్లికి మందులు కొనలేను..ఇంకెన్నాళ్ళు బతుకుద్దో..ప్చ్.. ఇద్దరు లేచారు రేపటి శవాల కోసం...

2 comments:

aasha said...

wah waa..wah waa...!hats off sir.....

vinayakam said...

thank u maam